BHAGAVATA KADHA-3    Chapters   

అయ్యో ! హరిచే రథమును తోలించితిని గదా !

59

శ్లో || సౌత్యే వృతః కుమతి నాత్మద ఈశ్వరో మే,

యత్పాదపద్మ మభవాయ భజంతి భవ్యాః |

మాం శ్రాంతవాహమరయో రథినో భువిష్ఠమ్‌,

న ప్రాహరన్యదనుభావ నిరస్త చిత్తాః ||

శ్రీ భాగ. 1 స్కం. 15 అ. 17 శ్లో.

" చ. వసుమతి దివ్యబాణముల ప్రక్కలు వాపి కొలంకుసేసి నా

రసములు మాటుగాఁ బఱపి రథ్యముల9రిపులెల్ల ఁజూడ సా

హసమున నీటఁబెట్టితి రణావని సైంధవుఁ జంపునాఁడు నా

కసుర విరోధి భద్రగతి నండయి వచ్చినఁగాదె భూవరా||"

--శ్రీ మదాంధ్ర భాగవతము.

ఛప్పయ

జినకే కమల సమాన, పూజి పగ ముని న అఘావేఁ |

హృదయ కమల మహఁధ్యాఇ, పార భవసాగర జావేఁ ||

నహిఁ పూజే పద పదము నింద్య కారజ కరవాయో|

మనమోహన తేఁ మహామోహ వశ రథ హఁకవాయో||

సమురి&ు సక్యోనహి ఁ శ్యామకూఁ మోహ్యో తబ మైఁ మందమతి|

హాయ్‌! లుట్యో బంచిత భయో, హృదయఫటత మన దుఖిత అతి||

అర్థము

ఎవని పాదపద్మములను మునులు పూజించి పాపము పోఁగొట్టుకొనుచున్నారో, హృదయకమలమున ధ్యానించి భవసాగరమును దాఁటుచున్నారో, అట్టివానిని నేను పూజింపక పోఁగా నింద్య కార్యములను జేయించితిని. మనోహరునిచే మహామోహవశమున రథమును ద్రోలించితిని.

కృష్ణుని నేను తెలిసికొనఁజాలకపోతిని, మందమతినై మోహపడితిని. అయ్యో! నేను వంచితుఁడనై తినిగదా ! హృదయము బ్రద్దలగుచున్నది. మనస్సు మిక్కిలి దుఃఖించుచున్నది.

-----

నిరంతరము దగ్గఱఉండుటచే పెద్దవారిదగ్గఱకూడ మనము నిర్భీకుల మగుచుందుము. వారివద్ద నంతగా సంకోచింపము. ఇఁక నా గొప్పవ్యక్తి తాను గొప్పయనుకొనక సమానులుగానే వ్యవహరించుచుందురు. వారికి భేదభావముండదు. మనమాతని ఉదారతాకృపలచే అతని మహత్వమును మఱచిపోవుచుందుము. సమానులుగానే వ్యవహరించుచుందుము. వారు మనలను వదలి వెళ్లిపోఁగానే వారిమహత్వము స్మరణకువచ్చి, వారి విషయములన్నియు మన హృదయ పటలమున చలనచిత్రమువలె వచ్చి నాట్యము చేయుచుండును. ఒకవేళ స్వార్థవశమున పొరపాటున నేదైన అయోగ్యకార్యమును వారిని చేయుమనిన, అప్పుడు వారు స్నేహపూర్వకముగ "నాయనా! ఈ కార్యము నాపదవీ ప్రతిష్ఠకు ప్రతికూలమైనదనియు, దానిని తనచే చేయింపవల" దనియుఁ జెప్పిన తర్వాత మనము, అప్పు డాతఁడు మనలను పాపమునుండి రక్షించినాఁడని సంతోషింతుము. అట్లుగాక ఆతఁడు నిషేధించక తన ఉదారతా వశమున నాయనుచిత కార్యమును గూడ మనమీఁదఁగల ప్రీతిచే సంతోషముతోఁ జేసిన తర్వాత " అయ్యో! నేను స్వార్థవశమున నామహావ్యక్తిచే నెట్టి నిందితకార్యములను జేయించితిని ! ఆతని కీర్తిప్రతిష్ఠలపైఁ గొంచెమైన లక్ష్యముంచనైతిని" అని పశ్చాత్తాపపడుదుము. ఇట్టిది హృదయమున ఉండి యుండి పొడుచుచుండును. మార్మిక పీడ కలుగఁజేయును.

శ్రీకృష్ణునిచే సారథ్యకార్యమును చేయించి యిప్పుడర్జునఁడు పశ్చాత్తాపము పడుచున్నాఁడు. భగవానుని మహత్వ మాతని కిప్పుడు తెలిసినది. ఎవనిని బూజ చేయవలసియుండెనో, ఆతనిచే నేను భృత్య, సేవక, సూతాదులు చేయవలసిన కార్యములు చేయించితిని. పూర్వము యుద్ధరథములలో మధ్య ఉన్నతాసనమున రథికుఁడు కూర్చుండెడువాఁడు. రథి వెనుక దృఢ రథధ్వజ దండముండెడిది. దానిపైన వారి వారి చిహ్నములతో విశాలధ్వజ మెగురుచుండెడిది. ఆ ధ్వజమును జూచి, యిది ఫలానావారి రథమని చెప్పవచ్చును. ధ్వజము యోజనముల దూరమునకుఁగూడ కనఁబడునంతటి విశాలముగ నుండెడిది. ధ్వజదండమునకు వెనుక కొందఱు నిలుచుండుట కవకాశ ముండెడిది.రథికునకు పృష్ఠరక్షకులు అస్త్రశస్త్రములను గైకొని రక్షించుచుందురు. ప్రక్కలందుకూడ పార్శ్వరక్షకులుండి రక్షించుటకు స్థలముండెడిది. ఇఁక ముందు సారథి కూర్చుండు స్థలము రథికుని పాదములు వ్రేలాడవేసిన నచ్చట నుండును. సారథికి అటునిటు ఆతనిని, గుఱ్ఱములను రక్షించుటకు సైనికులుందురు. రథమునకు వెనుక ఇంకొకటి చిన్నరథము వంటిది తగిలింపఁబడి యుండును. దానిమీఁద వివిధాస్త్రశస్త్రములుండును. రథికుని వద్ద అస్త్రశస్త్రము లైపోయినచో పృష్ఠరక్షకులు వాటినుండి తీసి యిచ్చుచుందురు. రథము మీఁదనుండు సైనికులు ధర్మానుసారముగ నెవరితోడను యుద్ధము చేయరు. వారిపని వచ్చెడి బాణములనుండి రథిని రథికులను రక్షించుటయు, వచ్చెడు అస్త్రములనుండి ప్రతీకారముగ నస్త్రములు వేయుటయు నై యున్నది. యుద్ధము రథికుఁడు మాత్రమే చేయును. యుద్ధోకోలాహలములో రథికుఁడు సారథికి నోటితో రథమును కుడియెడమలకు పోనిమ్మని ఆజ్ఞలొసంగరు. నోట నాజ్ఞలొసంగక పోవుటకు చాలకారణము లున్నవి. ఒకటి కోలాహలములో వినఁబడదు. రెండవది రథికుని ధ్యానము శత్రుసంహారమందేయుండను. ముఁడవది వానిమాటలు విని ఎదుట నున్న శత్రువు ప్రతీకార మొనర్పవచ్చును. నాలుగవది రథము మీఁదనున్న యితర సైనికులదృష్టియు మరలవచ్చును. ఈ కారణములచే రథికుఁడు మౌనియై ఆజ్ఞల నొసంగును. మాటలు మాటలాడుట ఆతఁడు శత్రువులతోనైన మాట్లాడును. రథము మీఁదవారితో కేవలము సంకేతముతోనే మాటలు జరుగుచుండును.

సారథియొక్క రెండు కణఁతలకు రథికుని కాలిబొటనవ్రేళ్లు రెండును తాఁకుచుండును. రథము నెటు త్రిప్పవలెననిన ఆవైపు కణఁతను బొటనవ్రేలితో నొక్కిన నాతఁడా వైపునకు రథము నడుపును. ఒక్కసారిగా వెంటనే రథమును ద్రిప్పవలయుననిన రథికుఁడు రెండు బొటనవ్రేళ్లతో గట్టిగా నొక్కి సారథి ముఖమును ద్రిప్పిన సారథి వెంటనే రథమును ద్రిప్పి పారిపోవును. అర్జునుఁడుకూడ ఇట్లు చేసేడువాఁడే. ఆతని కాలి బొటనవ్రేళ్ల రెంటిని శ్యామసుందరుని ఉంగరములు తిరిగిన ముంగురులు కల కణఁతలమీఁదనే పెట్టెను. నిరంతరము బొటనవ్రేళ్లచ్చటనే యుండుటచే నచ్చట గుంటలు కూడ పడినవి. ఆగుంటలు అంగుష్ఠ నియములా యనునట్లుండెను. నేఁడు దానిని దలఁచుకొని అర్జునుఁడేడ్చుచుండెను. ఏ పాదపద్మములను ఋషులు , మునులు, జ్ఞానులు, ధ్యానులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు మొదలగు తపస్వులగువారు మోక్షముకొఱకై పూజింతురో, తన కఠిన చేతులు తగిలిన ఎక్కడ నొచ్చునో యని లక్ష్మీదేవి యెవరిపాదములను బట్టుకొనుటకు భయపడునో, ఏ పాదపద్మపావన పరాగమును బొంది బ్రహ్మాదిదేవతలు తమ్ము కృతకృత్యులుగ దలతురో, ఎవని కాళ్లు కడుగ నీతు త్రైలోక్య పావమగు గంగ యైనదో, ఆ ప్రభుని అరుణ చరణములను నేను శిరస్సుతోఁ బూజింపలేదు. ఆ జగత్పావన పరాగమును మస్తకమున ధరింపలేదు. పైఁగా నాజగద్వంద్యుని మస్తకమున నాకలుషిత పాదములనుంచి పాపమున కొడిగట్టితిని.

ఆతఁడెంత గొప్పవాఁడు. ఆతనితో సమానమగు గొప్ప వాఁడీలోకమున నెవఁడుండఁగలఁడు? నేనాతని నెట్లు చేసిన నట్ల య్యెను. ఏమిచేయించిన దానిని జేసెను. ఏమి చెప్పిన దానిని వినెను. నాతో నెంత ప్రేమగా మాటాలాడెడువాఁడు!' అర్జునా! పృథానందనా ! మిత్రవరా ! కురుకుల తిలకా !' అని నోటినిండ పలుకుచు నిట్లు సంబోధించుచుండినపుడును, 'బావా!' యని పిలుచునప్పుడును ఆపలుకులలో ప్రేమ ఒలుకుచుండెడిది. ఆతని యుచ్చారణలో నెంతటి స్వారస్యమున్నది? ఇప్పుడట్లు నన్నెవరు పిలువఁగలరు ? నన్నిట్లు పిలిచి ఉత్సాహము నినుమడించువారేరీ ? ఇవి జ్ఞాపకమునకు వచ్చిన హృదయము చూర్ణమగుచున్నది. గుండె బ్రద్దలగుచున్నది. చిత్తము కలతచెందుచున్నది.

హస్తినాపురములో నొక దినమున రాత్రి చాల ప్రొద్దు పోవువఱకు శ్రీకృష్ణుఁడు నిద్రపోలేదు. నే నంతఃపురము నుండి వచ్చుట ఆలస్యమైనది. ఆతఁడట్లు కూర్చుండుటను గాంచి 'శ్యామసుందరా! ఇంకను నిద్రపోలేదేమి?' అంటిని. 'అర్జునా! నీవులేక పోవుటచే నాకు నిద్రలేదు' అని ఆతఁడతి స్నేహస్వరమున ననెను. ఆ వాసుదేవునకు నావలన నేమి ప్రయోజనము? కాని ఆతని స్నేహమట్టిది. తిరుగఁబోయినప్పుడు పిల్లలవలె భయపడుచు మీదగ్గఱకు వచ్చును. చిన్నపిల్లలు భయపడుచు తల్లి, తండ్రి, గురువులయొద్ద నిలువఁబడి యాజ్ఞ అడుగునట్లు మీముందఱ లేచి నిలువఁబడి సంకోచస్వరముతో 'మేము వాహ్యాళికి వెళ్లవలెనని యున్నది. ఆజ్ఞ యగుచోఁద్వరగా వెళ్లి తిరిగి వచ్చెద' మనును. మీయాజ్ఞయైనచో వెంటనే సంతోషముతో నాభుజముమీఁద చేయివైచి తీసుకొనిపోవును. ఆ సమయమున నాతఁడెంతో కలిసి మెలసి మాటలాడును.

ఎక్కడనైన కూర్చుండవలసి వచ్చిన మాయిద్దఱకు రెండు వేఱువేఱాసనములు వేసిన నాతఁడు తన యాసనమునఁ గూర్చుండఁడు. నా యాసనము మీఁదకు వచ్చి కూర్చుండి నన్నావలకు జరిపి నవ్వును. " పిల్లచేష్ట లింకను బోవనే లేదు కృష్ణా!" యని నేననఁగా విని కిలకిల పకపక నవ్వి క్రింద దొర్లుచుఁ బ్రేమతో నిట్లనును :- " అర్జునా ! నాబాలత్వము పోవలెనని నేను కోరను. నేనిట్లు పిల్లవానివలె నవ్వుచు నాడుచు పాడుచు నుండవలెనని నాకోరిక. ఈ బాలత్వము నాకు సంపత్తు. నాజీవనవ్యాపారము నవ్వుటే. నాయనమ్మ చచ్చినవాఁడేడ్వవలెను. నాకు నాయనమ్మ ఉన్నది. తాత ఉన్నాఁడు. ఒక్క తల్లి కాదు. ఏ డ్గురు తల్లులు బ్రదికియే యున్నారు. అందఱు నన్నుఁ బ్రేమింతురు. ఇఁక నేనేల నేడ్వవలెను ?

అంత నేను నవ్వుచు " పదునాఱువేలమంది పూరీసేనను సిద్ధముచేసి పెట్టినచో నేమగు" ననఁగా విని నవ్వును. ఇది చెడ్డ యని యనుకొనఁడు, అప్రసన్నుఁడును గాఁడు. మాటమాటకు, మాటిమాటికి నవ్వుటే ఆతని స్వభావము.

ద్వారకలో మేమున్నప్పుడు భోజనసమయ మయ్యెడిది. ఎంత పిలిచినను మహలునుండి రాఁడు. ఆతఁ డెల్లప్పుడు ' అర్జునుఁడు ఎక్కడికి వెళ్లినాఁడు? అర్జునుఁడు ఎక్కడికి వెళ్లినాఁ' డని అడుగును. నేను రాఁగానే నన్ను వెంటఁ గొనిపోవును. ఇద్దరము ఒక్కసారిగా తినెడువారము. కులాసాగా యున్నప్పుడు తనకు సంబంధించిన గొప్ప విషయములు చెప్పును. " నేనిదిచేసితిని, అదిచేసితిని, వానిని గొట్టితిని, వీనిని జంపిచితిని, వానిని బడఁ గొట్టితిని, వీనిని యమపురి కంపితిని" అని చెప్పును. అప్పుడు నే నిట్లనెడునాఁడను :- " ఇవన్నియుఁ గట్టిపెట్టుము. ఏమి బడాయిలు కొట్టెదవు ? మన్ను తిన్నప్పుడు యశోద దగ్గఱ అబద్ధము లాడితివి. భయపడి మధురను వదలి సముద్రములో దాఁగితివి. గొప్ప సత్యవాదివే. నీవు బడాయిలు కొట్టఁదలఁచిన గొఱ్ఱలమందలవలె చేరిన ఈ రాణులవద్ద కొట్టుము. నావద్ద ఈ ఆకాశపాతాళముల నొక్కటి చేయకుము." ఆతని భార్యలముందిట్టి మాట లనినప్పటికిని ఆతఁడు నొచ్చుకొనెడువాఁడు కాఁడు. ఇట్టి మాటలను పసిపిల్లవాఁడు కొట్టిన తల్లి సహించినట్లును, యువకుఁడగు పుత్రుఁడు బడాయిలు కొట్టుచుండిన తండ్రి విని విననట్లూరకొన్నట్లు ఉపేక్షించును.

మహాభారత యుద్ధము జరుగునట్లు నిశ్చయము కాఁగానే మీరు నన్ను శ్రీకృష్ణుని దగ్గఱకు రణనిమంత్రణమునకై పంపితిరి. దుర్యోధనునకు లోకములోని యోధులందఱను దనవైపునకుఁ దీసికొని పోరాడవలెనని ఆతని యూహ. మనవైపున నొక్కరు నుండకూడ దనియు నాతని కోరిక. రాజులలో యుద్ధనియమ మేమనగా ముందుగా యుద్ధమున కెవరు పిలుతురో వారు వారి ప్రక్క పోరాడవలయును. ఎట్లైనను శ్యామసుందరుని తన వైపునకుఁ ద్రిప్పుకొనవలెనని, నేను వెళ్లుదునని ముందుగానే తెలిసికొని, నాకంటె ముందుగా రథము మీఁద రాత్రులందే ప్రయాణముచేసి నాకంటె ముందే ద్వారకకు చేరెను. అప్పటికి కృష్ణుఁడు నిద్రించుచుండెను. అప్పుడు దుర్యోధనుఁడభిమాని యగుటచే కృష్ణునకు శిరస్సుకడ శయన గృహములోఁ గూర్చుండెను. నేను వెళ్లునప్పటికి యిదివఱకే దుర్యోధనుఁడు వచ్చినాఁ డనుసంగతి తెలుసుకొని త్వరత్వరగాఁబోయి కృష్ణునిపాదములకడ కూర్చుంటిని. ప్రతిదినము కృష్ణుఁడు అరుణోదయమునకుఁ బూర్వమే లేచెడువాఁడు. కాని యాదినమున సూర్యోదయమగు వఱకు నిద్రించుచుండెను. అప్పుడు 'రామ రామ, నారాయణ నారాయణ' యనుకొనుచు విశాలపద్మాక్షులను నలుపుకొనుచు లేచెను. ఆతఁడు దుర్యోధనుఁడున్నాఁడని తెలిసియుఁ జూడ లేదు. లేవఁగానే నన్నిట్లడిగెను :- " ఓహో ! నేఁడర్జునుఁడు వచ్చినాఁడే ? స్వాగతమ్‌, స్వాగతమ్‌!" ఇంతలో దుర్యోధనుఁడిట్లనెను :- " మహారాజా ! నే నర్జునునికంటె ముందుగానే వచ్చి నిరీక్షించుచుంటిని."

ఇది వినఁగానే వెనుకకుఁ దిరిగి తెలియనివానివలె సంభ్రమముతో నిట్లనెను :- " ఆహా ! మంచిది ! దుర్యోధనమహారాజులుకూడ వేంచేసిరి. ధన్యవాదములు ! ధన్యవాదములు!"

దుర్యోధనుఁడు ధృఢముగా నిట్లనెను :- " ధన్యవాదములు తర్వాత. ధర్మవేత్తలగు క్షత్రియులు మొదట వచ్చినవాని నిమంత్రణమునే స్వీకరింతురు. కావున నీవు మావైపునఁ బోరాడ వలయును."

భగవానుఁ డిట్లనెను :- " అవును బావా ! యుద్ధనియమమంతియే. రెండు పక్షములలో ముందు వచ్చినవారి పక్షముననే ధర్మాత్ములగు క్షత్రియులు యుద్ధము చేయుదురు."

ఉ. "ముందుగ వచ్చితీవు మునుముందుగ నర్జున నేను జూచితిన్‌

బందుగు లన్న యంశమది పాయకనిల్చె సహాయ మిర్వురన్‌

జెందుట పాడి, మీకునయి చేసెద సైన్యవిభాగ మందు మీ

కుం దగుదానిఁగైకొనుఁడు కోరుట బాలుని కొప్పు ముందుగన్‌."

--- శ్రీ తిరుపతి వేంకటేశ్వరుల పాండవోద్యోగము

దుర్యోధనుఁడిట్లెను :- " కాదు, మహారాజా ! మీ రన్యాయము చేయుచున్నారు. అందఱు నడుగుఁడు. నేను ముందుగా వచ్చి కూర్చుంటిని."

భగవానుఁడు కొంచెము విసుగుకొని యిట్లనెను :- " ఆహా ! మీరెట్టి పలుకులు పలుకుచున్నారు ? నాకింకొకరు సాక్షులెందులకు ? నీ మాటమీఁద నాకు విశ్వాసము కలదు. నీవు నిజముగ మొదటనే వచ్చియుండవచ్చును. నా దృష్టి మొదటలో నర్జునునిమీఁద పడినది. నాదగ్గఱ అపరాజితులగు గోపకులు కోటిమంది కలరు. వారిని నారాయణ సేన యందురు. వారందరు ఱొకప్రక్కన, నిశ్శస్త్రుఁడనై నేనొక ప్రక్నన. నేను శస్త్రము పట్టను, యుద్ధము చేయను. ఊరక పైపై సలహాల నిచ్చుచుందును. ఈ రెంటిలో మీయిష్టము వచ్చినది కైకొన వచ్చును. అర్జునుఁడు చిన్నవాఁడు. పిల్లవాండ్రకు పోఁగా మిగిలినది పెద్దవారికి. కావున నర్జునుని ముందు కోరుకొననిమ్ము".

నేను సమస్త నారాయణ సేనను కోరుకొనిన బెల్లము పేడయగునని ఆతని భయము. కాని సేన నాకెందులకు ? నేను వెంటనే "నాకు సేన అక్కఱలేదు నీవే కావలెనంటిని".

భగవానుఁడు నావైపు ఆశ్చర్యచకితుఁడై చూచుచు నిట్లనెను :- " బాగుగా చెవులు పెట్టుకొని విను. నేను యుద్ధము చేయను. ఆయుధము పట్టను. నీవు మోహములో పడవలదు. నీహితాహితము నాలోచించుకొని నీయిష్టము వచ్చిన వస్తువు నెన్ను కొనుము."

ఇంతలో దుర్యోధనుఁ డిట్లనెను :- " మహారాజా ! మీరు అంతయు తలక్రిందులు చేయుచున్నారు. ఆతఁడు నిన్ను కోరుకొనఁగా మరల దానిని మార్పఁజూచెదరేల ? మీరనినట్లే మీసేనయంతయు నాపక్షమైనది. మీరు అర్జునుని పక్షమైతిరి. ఇఁక దీనిని మార్చఁగూడదు. నాకీ నిర్ణయము ముమ్మాటికి నంగీకారమే."

భగవానుఁడు మరల నవ్వి నాతో నిట్లనెను :- " అర్జునా! నిరాయుధుఁడనగు నన్ను ఁగైకొని నేఁడు నీవు మోసపోయితివి. బాగుగా పోరాడు నారాయణసేన నేల నెన్ను కొనలేదు?"

నేను దృఢముగ నిట్లంటిని :- " వాసుదేవా ! నాకు సేనతో నవసరములేదు. నాకు నీవు కావలయును."

దుర్యోధనుఁడు శీఘ్రముగ నాసనమునుండి లేచి యిట్లనెను :- " మంచిది. యదునందనా ! నీవు నీప్రతిజ్ఞను గాపాడుకొనుము. నీసేనయంతయు నావంతు " అని ఆతఁడప్పుడే లేచి వెంటనే బలరాముని కడకు వెళ్లెను.

దుర్యోధనుఁడు వెళ్లిపోఁగానే కృష్ణుఁడు పట్టుశాలువ కప్పుకొనియే గట్టిగా నన్ను ఁ గౌఁగిలించుకొని యిట్లనెను :- " అర్జునా ! నీవు సేనను అడుగక శస్త్రము పట్టని నన్నుఁ గోరితి వేల ? నీవు నాచే నేమి చేయింపఁదలఁచినావు ?"

అయ్యో ! ఆ సమయమున నా బుద్ధి బుగ్గియైనది. ఆ సమయమున శ్యామసుందరుఁడు నా వివేకమును హరించెను. నాముందు తన యైశ్వర్యము నంతను ఆతఁడు దాఁచేను. ఆ సమయమున నేనిట్లనవలసినది ;- " ప్రభూ ! నేను ప్రతిదినము నీపూజ చేయుచుందును. ప్రతిదినము నీ అరుణ చరణములను గడిగి పుచ్చుకొనుచుందును. యుద్ధమునకుఁ బోవునప్పుడును, యుద్ధము నుండి రాఁగానే నాకను ఱప్పలతో నీపాదపద్మ పునీతపరాగమును దులిపెదను. నిన్ను నాహృదయ మందిరమునఁ గూర్చుండఁబెట్టి సర్వదా నిన్ను ధ్యానించెదను." నేనిట్లనక " శ్యామసుందరా! నీవు నాకు సారథివి కావలెను. వాసుదేవా ! నీవంటి సారథి చిక్కి, నారథమును నడిపినచో నేనొక్కడనే త్రైలోక్యవిజయుండను కాఁగలను."

రాజా ! ఆసమయమున నాతఁడు నన్ను గద్దించి స్నేహ ముతో నిట్లనవలసినది:- " అర్జునా ! ఈ పని నాకనురూపముగ లేదు. ఈపని హీనవర్ణుఁడగు సూతుఁడు చేయవలసినది." కాని ప్రభూ ! ఆతఁడట్లనలేదు. మిక్కిలి ఉల్లాసముతో నన్ను ఁ బ్రశంసించుచు నిట్లనెను :- " వహ్వా ! నీకు యాలోచన తట్టినదోయి ! రథము నడుపుటలో నేను పరమ ప్రవీణుఁడను. నేను నీరథమును నడిపెదను."

మహారాజా ! అల్ప విజయము కొఱకును, ప్రశంసా ప్రతిష్ఠల కొఱకును ఎవని పాదపద్మములను గొప్పగొప్ప ఋషులు, మునులు, మోక్ష ప్రాప్తికొఱకు పూజింతురో అట్టివానిచే తుచ్ఛాతితుచ్ఛ సారథ్యమును జేయించితినే యని చింతిల్లు చున్నాను. ఆతని తలపై పాదములను మోపి ఆజ్ఞల నిచ్చితిని. ఆతఁడును నాయజ్ఞాలను నిజసేవకులనివలె, జీతము పుచ్చుకొన్న భృత్యునివలెఁ బాలించెను.

మహారాజా! నాకుమారుని జంపిన జయద్రధుని జంపుదునని ఘోర ప్రతిజ్ఞను జేసిన ఆదినమును మఱవఁజాలను. నాఁడు సూర్యాస్తసమయములోగా జయద్రధుని జంపకున్న నేనగ్ని ప్రవేశమును నీజీవములతోడనే చేసెదనని భీషణ ప్రతిజ్ఞను జేసితిని. ఆ విపుల సేననుంచి, ద్రోణ , కర్ణ, శల్యాది వీరులతో సమానమగు యోధులచే ఁ జుట్టుకొనబడిన జయద్రధుని బట్టుకొని వచ్చుట, మేరుపర్వతము క్రిందనున్న కలుగులో దాఁగిన యెలుకను బట్టుట సర్పమునకెంతటి కష్టమో అంతటి కష్టము. కాని కృష్ణ కృపచే నాయా అసంభవ ప్రతిజ్ఞకూడ సంభవమైనది. నెఱవేఱని ప్రతిజ్ఞ నెఱవేరినది.

ఆతఁడూరక సారథియైనను ఆతని విధ్యుక్త ధర్మమును చాల తెలివితేటలతో నిర్వహించెను. కులపరంపరాగతమగు సారథ్యమును జేయువానికంటె మిన్నగ సారథ్యమును నెఱపెను. జయద్రథుని వధరోజుననే యోధులందఱు నన్నొక్కుమ్మడిగఁ జట్టుకొనిరి. అందఱు నొక్కసారిగి నసంఖ్యాకములగు బాణము లను బ్రయోగించుచుండిరి. ఆదినమున నందఱును గలిసి నన్ను జంపి జయద్రథుని రక్షింపఁ బ్రయత్నించిరి. జయద్రథుని కోసుల దూరమున అనేక వ్యూహములను బన్ని సురక్షితునిజేసి దాఁచి యుంచిరి. ఆతని దగ్గఱకు నేను చేరకుండునట్లు నాచుట్టును అందఱు క్రమ్ముకొని మధ్యలోనే ఆపఁజూచిరి. నాదివ్యరథమును విఱుగఁగొట్టలేకపోయిరి. కాని నాగుఱ్ఱములను నొవ్వఁజేసిరి.

రణక్షేత్రమధ్యమున నాలుగువైపుల గొప్ప గొప్ప శూరులగు యోధులు నన్ను ముట్టడించినప్పుడు నాసారథియగు శ్యామసుందరుఁడు "అర్జునా! ఇఁక గుఱ్ఱములు నడువవు" అనెను.

ఇది వినఁగానే నాముఖము మలినమయ్యెను. ' ఈ దినమున నా ప్రతిజ్ఞ నెరవేరదు. నేనగ్ని ప్రవేశము చేయవలసినదే' యనుకొంటిని. భయభీతుఁడనై వినయభావముతో నేనిట్లంటిని :- " శ్యామసుందరా ! ఎట్లైన నారథమును జయద్రథుని సమ్ముఖమునకుఁ గొనిపొమ్ము." ఆతఁడు వెనుకాడుచు నిట్లనెను :- " బావా ! నీ వేమి మాటలాడుచున్నావు ? గుఱ్ఱములలో నేదైన శక్తియుండిన గదా నేమైనఁ జేయుట ? వాటి శరీరముమీఁద బాణము తగులనిచోటు నువ్వుగింజంతైన లేదను సంగతి నీవు చూచుట లేదా ? యుద్ధము చేసి చేసి యివి యలసినవి. ఇఁక నివి యొక అడుగైనఁ బోఁజాలవు."

చింతిత స్వరముతో నేనిట్లంటిని :- " ప్రభూ ! అయితే యింకేమైన నుపాయము కలదా ? ఇవ్వేళ మన ప్రతిజ్ఞ నెఱవేరున దెట్లు ?"

ఆతఁడిట్లనెను :- " అవును, ఉపాయ మొకటి కలదు. గుఱ్ఱములకు నీరు దొరకవలెను. గుఱ్ఱము లీదఁగలిగినంత విపుల జల ముండవలెను. నేను వీటికి మాలీసు చేసెదను. బాణము లను బెఱకి వేయుదును. అవి కొంత స్వస్థత చెందిన తర్వాతఁ బరుగెత్తఁ గలవు."

రణమధ్యమున శత్రుమధ్యమున నింతటి నీరెక్కడనుండి వచ్చును ? కాని యాతఁడు నాయంతఃకరణము లోనికిఁ బ్రవేశించి ప్రేరేపించెను. నేనిట్లంటిని :- " వాసుదేవా ! నీవు రథమునుండి గుఱ్ఱములను విప్పుము. నేనిక్కడనే సరోవరమును నిర్మించెదను."

ఆశ్చర్యమును బ్రకటించుచు నాతఁడిట్లనెను :- " నీకు నలువైపుల గొప్పగొప్ప బలవంతులగు శత్రువులున్నారు. నీవు క్రిందకు దిగుటను గాంచి చంపివేయుదురు. ఇట్లు మాట లాడెదవేల ?"

నేను దృఢముగ నిట్లంటిని :- " దేవకీనందనా ! నీవు ఉండగా నన్నెవరును జంపలేరు, పరాజితు నొనరింపలేరు. మీరు నన్ను బరీక్షింపవలదు. ఆలస్యము చేయవీలులేదు. జయద్రథుని వధ యాలస్యమగుచున్నది."

ఇది వినఁగానే ద్వారకాపతి నవ్వెను. ఆతఁడు గుఱ్ఱము లను విప్పెను. నేను నాగాండీవమును మ్రోగించి నేలపై నిలువఁబడి చుట్టుముట్టిన శత్రువులను జూచుచుంటిని. నా సారథియగు శ్యామసుందరుఁడు స్వయముగ గుఱ్ఱముల శరీరము మీఁది బాణములను బెరికెను. తన కరకమలములతో వాటికి బాగుగా మాలీసు చేసెను. భగవానుని గట్టి అఱచేతులచే రుద్దుటచే గుఱ్ఱముల శ్రమయంతయుఁ దీఱను. అంత అశ్వరక్షకుఁడగు నచ్యుతుఁడు నాతో నిట్లనెను :- " అర్జునా ! గుఱ్ఱముల కిప్పుడు నీరు కావలయును." నేను నాధనుస్సునకు వారుణాస్త్రము నభిమంత్రించి ఒక దీప్తి మంతముగు బాణముచే నేలకుఁగొట్టితిని. చూచుచుండఁగనే క్షణములో చక్కని, స్వచ్ఛ జలములుగల మనోహర సరోవరమయ్యెను. భగవానుఁడిది చూచి చాల సంతోషపడెను. ఆతఁడు దానిలో వాటికి త్రావ నీరు పట్టెను ఆతఁడు గుఱ్ఱములతో ఁగూడ అగాద సరోవరములోనికిఁ బ్రవేశించెను. వాటిని తోముచు వాటిని నీటిలో నీదించెను ఈది గుఱ్ఱములు ఱక్కలు విదల్చునప్పటికి వాటి బాధ, అలుపు, సొలుపు అంతయుఁ దీఱను. కృష్ణుఁడు, నన్నుఁ బ్రశంసించుచు నిట్లనెను :- " వహ్వా ! అర్జునా! నీవు ధన్యుఁడవు!' నేనొనర్చిన యీ యాశ్చర్యకార్యమును గాంచి శత్రువులు స్తంభితులై నిలిచిరి. వారు నాపై బాణములు వేయ మఱచిరి. తదేక దృష్టితో నేనును కృష్ణుఁడును చేసిన కార్యమును జూచి అట్లే నిలిచిపోయిరి.

ఈవిధముగ భరతకులభూషణా ! మహారాజా ! భగవానుఁ డెన్నోవిధముల నన్ను రక్షించెను. ఎన్నెన్ని సంకటములనుండి నన్ను కాపాడెను ! గర్భస్థ బాలకుని తల్లి సావధానముగ రక్షించినట్లు నన్ను సదా రక్షించుచుండెడి వాఁడు. ఇట్టి జగత్పతిని నేను లోభవశమున, ప్రశంసా ప్రతిష్ఠల కొఱకు, క్షణమాత్రము సమ్మానము కొఱకు యుద్ధమున సారథిగా నొనర్చితిని. మహాభారత యుద్ధములో నాబాహుబలము చేతనే విజయము సిద్ధించిన దనియు, నేనే నాతీక్ష బాణములచే భీష్మ, ద్రోణ కర్ణాది మహారథుల నోడించితిననియు నాకు ఇప్పటి వఱకు గర్వము కలదు. కాని అది నావిజయము కాదు. శ్యామసుందరుని విజయమని నాకిప్పుడు బాగుగాఁ దెలిసినది. వారిని నేను జంపలేదు. కాల స్వరూపుఁడగు శ్రీకృష్ణుఁడే తన దృష్టి మాత్రముచేతనే చంపెను. ఆతఁడు లేకుండిన నేనేమియుఁ జేయఁగలవాఁడను కాను. నేనా అర్జునుఁడనే కాని నేఁడు నన్ను ఆటవిక భిల్లు లోడించిరి. శ్రీకృష్ణుఁడు లేకపోఁగానే నాధనుర్బాణము లన్నియు దేనికిని బనికిరాకుండ పోయినవి. నాయస్త్ర శస్త్రములన్నియుఁ గుంఠితనము లైనవి. నేఁ డా తపస్వినీ శాపమునిజమయ్యెను. నేఁడు నేను ఊరుపేరు లేనివారిచే నోడిపోతిని. నేఁడు పెచ్చు పెరిగిన నా యభిమాన గర్వము లుడిగిపోయినవి. రాజా ! ఇఁక ముందీ లోకములో నవమానమునే చూడవలసి వచ్చును. పాపులచేఁ బరాజితులము కావలసి యుండును. దానికి ఒప్పుకొనిననే యీ భూమిపై నుండవలెను. లేదా శీఘ్రముగ నుత్తరాఖండము వైపునకుఁ బ్రస్థానింపవలయును. ఇప్పుడు కలియుగము వచ్చినది. ఇఁక భూమిపై నుండరాదు."

ఇట్లని అర్జునుఁడేడ్వఁ బ్రారంభించెను.

ఛప్పయ

కహూఁకహాఁ తక ప్రభో ! శ్యామ మోకూఁ అపనాయో |

ఘోడే ఘాయల భ##యే చలేఁ నహిఁ మైఁ ఘబరాయో||

సబ శత్రునితేఁ ఘిర్యోడర్యో హరినేహ నిహార్యో |

సమురి&ు శ్యామ సంకేత బాణతేఁ నీర నికార్యో ||

హయ ప్యాయే తైరాఇకేఁ, శర నికారి మలి జోరి రథ|

చలే, శత్రు మోహిత కరే, గయే త్యాగి అబ హమ బిరధ||

అర్థము

అన్నా ! ధర్మరాజా ! శ్యామసుందరుఁడు నన్నెట్లు దగ్గఱకు తిసి రక్షించెనో యెంతని చెప్పఁగలను ? యుద్ధములో గుఱ్ఱములు గాయపడి నడువఁజాలక పోయెను. అప్పుడు నేను చాల భయ పడితిని. శత్రులందఱును జుట్టుముట్టి యుండగా భయపడితిని. హరి స్నేహమునఁ జూచెను. శ్యామసుందరుని అభిప్రాయమును దెలిసికొని వారుణాస్త్రము బాణముచే నీటిమడుగు నేర్పఱచితిని.

గుఱ్ఱములు వాటిలో దప్పిక తీర్చుకొనెను. బాగుగా నీదెను. అంత వాటిని రథమునకుఁ గట్టి తోలెను. అప్పుడీ కార్యములచే శత్రువులను మోహితులఁ గావించెను. అట్టి శ్రీకృష్ణుఁడు మనలను వీడి వెళ్లిపోయెను.

----

BHAGAVATA KADHA-3    Chapters